ఇచ్చిన హామీలు అమలు చేయాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

ఇచ్చిన హామీలు అమలు చేయాలి : ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • ఉచితాలపై జడ్జిలు కూడా రాజకీయ నేతల్లా మాట్లాడుతున్నరు: ఎమ్మెల్యే కూనంనేని 

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పరస్పర అవగాహన విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే  కూనంనేని సాంబశివరావు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఇచ్చిన హామీలను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే అప్పులు తెచ్చైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,  హామీల అమలుకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్ లోని సీపీఐ స్టేట్ ఆఫీస్ మగ్దూం భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, జయప్రకాశ్ నారాయణ వంటి కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఉచితాలు తప్పు అంటున్నారని,  సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సైతం రాజకీయ నేతల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వారు దేశ ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్థితిగతులను అర్థం చేసుకొని మాట్లాడినట్లు లేదన్నారు. ప్రధాని మోదీ ఫ్యూడల్ ఆలోచనా విధానం నుంచి బయటకు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణనను చేపట్టాలని కోరారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే చట్టం చేయాలన్నారు.