
- సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారు: కూనంనేని
హైదరాబాద్, వెలుగు:తాను టూరిజం డెవలప్మెంట్ చేయాలని చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వక్రీకరించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఫైర్ అయ్యారు. ‘‘టూరిజం ద్వారా నిధులు సమకూరుతాయని తాను చెప్తే. ఏ ఇజం లేదు.. టూరిజం మాత్రమే ఉందని 30 ఏండ్ల కిందనే చెప్పానని, ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఒప్పుకున్నారని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉంది” అని అన్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని ముగ్దూం భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కంటే సజావుగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయన్నారు. అప్పట్లో మాట్లాడే వారిని మార్షల్స్ తో బయటకు పంపించేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చారన్నారు. అందుకు స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టులకు పేదల కేటగిరిలో సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, ఆరోగ్య బీమా తదితర సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ఒక పాలసీ తీసుకరావాలన్నారు.