జీజీహెచ్​ను భ్రష్టు పట్టించారు: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

జీజీహెచ్​ను భ్రష్టు పట్టించారు: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • వైద్యులు, వైద్య సిబ్బంది పనితీరుపై ఎమ్మెల్యే  ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం గవర్నమెంట్ ​హాస్పిటల్​(జీజీహెచ్​)ను అధ్వానంగా  మార్చారని స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీజీహెచ్​ను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వైద్యులు, వైద్యసిబ్బంది పనితీరుపై మండిపడ్డారు. సిబ్బంది గైర్హాజరుపై అసహనం వ్యక్తం చేశారు. 39 మంది డాక్టర్లకు గానూ 12 మంది మాత్రమే విధులకు హాజరవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

ప్రభుత్వ వైద్య వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్​లో పరికరాలు, మందుల కొరత, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును హెల్త్​ మినిస్టర్​ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. హాస్పిటల్​ను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్​ పాషా, నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, భూక్యా శ్రీనివాసరావు, రమేశ్, ప్రశాంత్, జోసెఫ్​ ఉన్నారు. 

ఆర్టీసీ సేవలు భేష్​

ప్రజాపాలన నిర్వహణలో ఆర్టీసీ సేవలు భేష్​ అని ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. కొత్తగూడెం ఆర్టీసీలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్​ సౌకర్యానికి మంచి స్పందన వస్తోందన్నారు. నష్టాల బాట నుంచి ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల్లో పయనిస్తోందని తెలిపారు. 

మౌలిక వసతులు కల్పిస్తాం

పాల్వంచ : మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని తవిశలగూడెం, పాయకారి యానం బైలులో రూ.40 లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈజీఎస్, డీఎంఎఫ్ డీ, ఎస్డీఎఫ్ నిధులతో గడిచిన 11 నెలల్లో రహదారులు, డ్రైనేజీలు నిర్మించినట్లు ఆయన తెలిపారు.