భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో ఒకటిగా కొత్తగూడెం నగరం అవతరించనున్నదని, కార్పొరేషన్ఏర్పాటుతో భారీగా ఫండ్స్వస్తాయని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. మంగళవారం లక్ష్మీదేవిపల్లి మండలంలోని టూరిజం హోటల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోనే రెండో పారిశ్రామిక జిల్లాగా భద్రాద్రికొత్తగూడెం జిల్లా మారనున్నదన్నారు. పాల్వంచ మున్సిపాలిటీకి గత 25 ఏండ్లుగా ఎన్నికలు జరగడం లేదని, కార్పొరేషన్ ఏర్పాటు పాల్వంచకు వరప్రదాయినిగా మారనున్నదని తెలిపారు.
కార్పొరేషన్ ఏర్పాటుతో ట్యాక్స్‌లు పెద్ద ఎత్తున పెరుగుతాయనేది, గిరిజనుల హక్కుల భంగం కలుగుతొందనేది అసత్య ప్రచారమన్నారు. త్వరలో కొత్తగూడెంకు ఎయిర్ పోర్టు రానున్నదని తెలిపారు. 800మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్ ను పాల్వంచలోని పాత ప్లాంట్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. 1/70చట్టం పరిధిలోని చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాల్లోని పలు గ్రామాలను కొత్తగూడెంలో కార్పొరేషన్లో భవిష్యత్‌లో కలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్పొరేషన్ ఏర్పాటులో ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు మంత్రుల సహకారం మరువలేనిదని తెలిపారు.