రాజ్యాంగంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టాలి.. సీఎంకు ఎమ్మెల్యే కూనంనేని లేఖ

రాజ్యాంగంపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టాలి.. సీఎంకు ఎమ్మెల్యే కూనంనేని లేఖ

హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం పూర్తయి 75 ఏండ్లయినందున అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి ఈ నెల 7న శాసనసభ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ లేఖ రాశారు.  ‘రాజ్యాంగం, దాని అమలు, విజయాలు, భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కార్యాచరణ’ అనే అంశంపై ప్రత్యేక చర్చ పెట్టాలని కోరారు.

ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో  రాజ్యాంగంపై ఉభయ సభలు చర్చించాయని, ఈ నెల 7న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించతలపెట్టిన శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో కూడా ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించి  రాజ్యాంగంపై చర్చ జరిపితే సముచితంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో శాసనసభా నాయకుడిగా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇదే  లేఖ ప్రతులను స్పీకర్, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రులకు కూడా ఆయన పంపించారు.