భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పట్టణంలో రూ. 1.70కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకు స్థాపన చేశారు. రూ. 2.20కోట్లతో పూర్తైన పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని సుందరంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నానన్నారు. కొత్తగూడెం పట్టణాభివృద్ధికి పెద్ద మొత్తంలో ఫండ్స్ తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నానన్నారు.
అభివృద్ధి పనుల్లోని నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఇంజనీరింగ్ ఆఫీసర్లకు సూచించారు. ఈ ప్రోగ్రాంలో మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, డిప్యూటీ తహసీల్దార్ అంజద్ పాషా, డీఈ రవి కుమార్, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, కౌన్సిలర్లు మాచర్ల రాజకుమారి, బండి నర్సింహరావు, సత్యవతి, రాజ నళిని, కంచర్ల జమలయ్య, భూక్యా శ్రీనివాస్, ధర్మరాజు, యూసుఫ్, విజయ్ కుమార్ పాల్గొన్నారు.