రూ.200 కోట్లతో హాలియా అభివృద్ధి : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

రూ.200 కోట్లతో హాలియా అభివృద్ధి : ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి

హాలియా, వెలుగు : రూ.200 కోట్లతో హాలియా పట్టణాన్ని అన్ని  విధాలా అభివృద్ధి చేస్తానని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. శనివారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని అనుముల వద్ద అమృత్​2.0 పథకంలో భాగంగా రూ.15.20 కోట్లతో చేపట్టనున్న ఓవర్​హెడ్ ట్యాంక్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం నిడమనూరు మండలం వేంపాడులోని తెలంగాణ బీసీ గురుకుల  బాలుర పాఠశాలలో ప్రభుత్వం పెంచిన డైట్ చార్జీలు, కామన్ మెనూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాలియా పెద్ద పట్టణంగా అభివృద్ధి చెందిందంటే దానికి మాజీ సీఎల్పీ లీడర్ కుందూరు జానారెడ్డే కారణమన్నారు.

మున్సిపాలిటీలో నీటి అవసరాలు తీర్చేందుకు త్వరలో రూ.50 కోట్ల మరో ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఎస్టిమేషన్ వేయించామని చెప్పారు. ఈనెల 29న పెద్దవూర మండలం చలకుర్తిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం తిరుమలగిరిసాగర్​ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు శాగం పెద్దిరెడ్డి తల్లి శాంతమ్మ మృతి చెందడంతో ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.