- దవాఖానకు తరలించగా మృతి
- నల్గొండ జిల్లా చర్లపల్లిలో ప్రమాదం
- కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు స్వాధీనం
నల్గొండ/ కంటోన్మెంట్, వెలుగు : నల్లగొండలో మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన సభకు బందోబస్తు విధుల్లో ఉన్న హోంగార్డును కారు ఢీకొట్టడంతో మృతిచెందాడు. నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన హోంగార్డు నవకిశోర్ (36) బీఆర్‌ఎస్ పార్టీ సభకు వచ్చే వాహనాలను నియంత్రించే విధుల్లో ఉన్నాడు. సభ పూర్తయిన తర్వాత నల్లగొండ శివారులోని చర్లపల్లి వద్ద వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో కిశోర్ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు. అదే టైంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ముందున్న కారును ఢీకొట్టింది.
ఆ కారు హోంగార్డును ఢీకొట్టడంతో కిందపడిపోయాడు. అతడిని దవాఖానకు తరలించగా చనిపోయాడు. మర్రిగూడ బైపాస్ వద్ద కూడా డ్యూటీలో ఉన్న హోంగార్డు వెంకటేశ్వర్లును కారు ఢీకొట్టడంతో గాయపడ్డాడు. ఇతడు నల్లగొండలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఎమ్మెల్యేకు సంబంధించిన కారుతో పాటు మరో కారును స్వాధీనం చేసుకొని విచారిస్తున్నామని నల్లగొండ రూరల్ ఎస్సై శివకుమార్ తెలిపారు. ఎమ్మెల్యే కూడా స్వల్పంగా గాయపడ్డట్టు సమాచారం.