బీఆర్ఎస్ లో టికెట్ల వివాదం ముదిరింది. ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాజీనామా చేస్తామంటూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆగస్టు 21న శివ్వంపేట, నర్సాపూర్, కౌడిపల్లి మండలాల బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముందే బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే మదన్ రెడ్డికి టికెట్ ఇవ్వకుండా.. ఎవరికీ ఇచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఓటమి ఖాయమని నాయకులు ఆరోపించారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్ ని కూడా కలుస్తామని తెలిపారు. నర్సాపూర్ గడ్డ మదన్ రెడ్డి అడ్డా అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేయద్దంటూ.. టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి పార్టీ నాయకులకు సర్ది చెప్పారు.
నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ఎన్నికల్లో సునీతా లక్ష్మారెడ్డి టికెట్ ఇవ్వనున్నట్లు అధికార పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యే మదన్ రెడ్డి వర్గీయులు నిరసనలు చేస్తున్నారు.