కొల్చారం, వెలుగు : బీఆర్ఎస్ నర్సాపూర్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి గురువారం మండలంలోని కొంగోడు, నాయిని జలాల్పూర్, అంసాన్పల్లి, పోతిరెడ్డిపల్లి, తుమ్మలపల్లి తండా, సీతారాం తండా, పోతంశెట్టిపల్లి, వెంకటాపూర్, అప్పాజిపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం నాయిని జలాల్పూర్లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఇల్లు కట్టుకోవడానికి గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షలు ఇస్తోందన్నారు.
ఈ సందర్భంగా అక్కడున్న ఓ మహిళ ఇళ్లు కట్టుకునేందుకు ఆ డబ్బులు సరిపోవు అనడంతో ఎమ్మెల్యే రెండు గుంటలు అమ్ముకొని ఇల్లు కట్టుకోవాలంటూ నచ్చజెప్పారు. కేసీఆర్ హయాంలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయని గుర్తుచేశారు. సునీతారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని, ఆయన ప్రవేశపెట్టిన పథకాలే బీఆర్ఎస్ ను గెలిపిస్తాయన్నారు. అనంతరం కొల్చారం మండలం పైతర సర్పంచ్ సంతోశ ఆమె భర్త ఎల్లేశం వారి అనుచరులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు.
ALSO READ : మైనంపల్లి వచ్చాకే కొట్లాటలు మొదలైనయ్ : పద్మా దేవేందర్ రెడ్డి
అలాగే కొల్చారం మండల బీజేపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ చౌరిగారి భాస్కర్ తో పాటు పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గౌరీ శంకర్, మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, గౌడ సంఘం అధ్యక్షుడు వెంకట్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, అరిగే రమేశ్, ఇంద్రసేనారెడ్డి, సంతోష్ రావు, రవితేజ రెడ్డి పాల్గొన్నారు.