
హైదరాబాద్ సిటీ, వెలుగు: కూకట్‌పల్లి నియోజకవర్గంలోని నల్లచెరువును పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని డెవలప్ చేయడం ఆనందంగా ఉందని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మిగిలిన చెరువులను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. మంగళవారం ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌తో కలిసి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కు వినతి పత్రం అందజేశారు. చెరువుల పరిసర ప్రాంతాల్లోని భూ యజమానులతోపాటు ప్లాట్లు ఉన్నవారికి టీడీఆర్ కింద తగిన నష్ట పరిహారం అందేలా చూడాలని కోరారు.
నకిలీలకు ఆస్కారం లేకుండా అసలు లబ్ధిదారులను గుర్తించాలన్నారు. అభివృద్ధి చేసిన చెరువుల్లో మురుగు నీరు కలవకుండా నాలాలను డైవర్ట్ చేయాలని సూచించారు. కబ్జాలకు పాల్పడినవారు ఎవరైనా పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఐడీఎల్ చెరువు, బోయిన చెరువు, ములకత్వ చెరువు, నల్ల చెరువులో కొంత భాగం బ్యూటిఫికేషన్చేశామని, కోర్టు కేసులుండడంతో పనులు పూర్తి చేయలేకపోయామని తెలిపారు.