మదనాపురం, వెలుగు: రైతుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని కురుమూర్తి రాయ ఎత్తిపోతల మోటార్లను ఆన్‌చేసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రెండేండ్లుగా ఈ ప్రాజెక్ట్ పూర్తిగా మరుగున పడిందన్నారు. యుద్ధప్రాతిపదికన లిఫ్ట్ రిపేర్లు చేసి ఆయకట్టుకు సాగునీటిని అందించడం ఆనందంగా ఉందన్నారు. లిఫ్ట్ చైర్మన్ రాజవర్ధన్ రెడ్డి, శేఖర్, గొల్ల రాజు, సత్యనారాయణ గౌడ్, రామచంద్రయ్య, అరుణ్ కుమార్, రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
మక్తల్: సంగంబండ ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తి బుధవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు సంగంబండ ప్రాజెక్టులో వరద నీరు చేరడంతో పూర్తి స్థాయిలో నిండిందని చెప్పారు. ప్రాజెక్టు కెపాసిటీ కంటే ఎక్కువ నీరు చేరడంతో ఇరిగేషన్ ఆఫీసర్లతో మాట్లాడి ముందస్తుగా నీటిని దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. మాజీ జడ్పీటీసీ లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ ఈఈ మహమ్మద్ హమీద్, గణేశ్, హేమ సుందర్, కృష్ణా రెడ్డి, కేశవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.