తెలంగాణ రాష్ట్రాన్ని హరీశ్ రావు, కేటీఆర్ ఆర్థికంగా దోచుకున్నరు : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రాన్ని హరీశ్ రావు, కేటీఆర్ ఆర్థికంగా దోచుకున్నరు : ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రాన్ని ఆర్థికంగా దోచుకున్నది హరీశ్ రావు, కేటీఆరేనని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్​రెడ్డి ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. హరీశ్​రావు రైతులపై ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నరని, బీఆర్ఎస్ సమావేశానికి హాజరైన వారికి బీర్లు, బిర్యానీలు పెట్టి కార్యకర్తలను తరలించారని తెలిపారు.

రుణమాఫీ విషయంలో హరీశ్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నరని, రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టు లోపు చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ చేసిన పది రోజుల్లోనే నగదు జమ చేస్తున్నమని, సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు అనేది పగటి కలేనని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఒక్క వార్డు మెంబర్ కూడా గెలిచే పరిస్థితి లేదని విమర్శించారు.