- మత్తులో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నడు
- కేటీఆర్ గురించి తెలిసే.. కేసీఆర్ బయటకు రావట్లేదు
- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చేయాల్సింది లై డిటెక్టర్ టెస్ట్ కాదని, నార్కో అనాలసిస్ టెస్ట్ అని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ మత్తులో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. శుక్రవారం సీఎల్పీలో మీడియాతో మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో రేవంత్ రెడ్డిపై కేసులు పెడితే ఏనాడూ భయపడలేదని, ఆ కేసులన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినా.. బయటకు వచ్చి పోరాడి సీఎం అయ్యారన్నారు. విచారణను తప్పుదోవ పట్టించడం, హాజరుకాకుండా తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ వ్యవహారాలన్నీ తెలిసినందుకే మాజీ సీఎం కేసీఆర్ బయటకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని అన్నారు.
కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసు, కవితపై లిక్కర్ కేసు, హరీశ్ రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు, కేసీఆర్ పై కాళేశ్వరం కేసు ఉన్నాయని.. కేసుల నుంచి తప్పించుకునేందుకే వారు ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం కుంభకోణాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందన్నారు. గ్రీన్ కో సంస్థతో సంబంధాలు లేకుంటే అక్రమంగా సొమ్ము ఎందుకు బదలాయించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నేరం ఒకటే కాబట్టి ఏసీబీ, ఈడీ ఒకేలా ప్రశ్నిస్తున్నాయని, దాన్ని కూడా తప్పుపట్టడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు.
పోలీస్, కోర్టుల వంటి రాజ్యాంగ వ్యవస్థలను సైతం అవమానించేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ‘‘లై డిటెక్టర్ టెస్టుకు సీఎం రేవంత్ రెడ్డి రావాలని కేటీఆర్ అర్థం పర్థం లేని వాగుడు వాగుతున్నారు. నీ మీద ఆరోపణలు వస్తే మా ముఖ్యమంత్రి లై డిటెక్టర్ టెస్టుకు రావాల్నా? గతంలో డ్రగ్స్ వ్యవహారంలో వైట్ చాలెంజ్ కు రేవంత్ రెడ్డి పిలుపునిస్తే పారిపోయిన నువ్వు.. ఇప్పుడు చాలెంజ్ చేయడం హాస్యాస్పదం” అని విమర్శించారు.