పురాతన ఆలయాలను అభివృద్ధి చేస్తాం
- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
నాగర్ కర్నూల్, వెలుగు: పురాతన దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పపారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయానికి సంబంధించిన కొత్త సంవత్సరం క్యాలెండర్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. జనవరి 2న వైకుంఠ ఏకాదశి, 14న గోదా కల్యాణం ఉత్సవాల కరపత్రాలను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 400 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని గ్రామస్తులు,భక్తులు అద్భుతంగా పునరుద్ధరణ చేసుకున్నారని అభినందించారు.ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, సునీల్ రెడ్డి , విశ్వేశ్వర్ రెడ్డి, వెంకట్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు .
బడి పనుల్లో జాప్యం ఎందుకు?
- కలెక్టర్ వల్లూరు క్రాంతి
గద్వాల, వెలుగు: మనఊరు–మనబడి పనులు ఎందుకు కంప్లీట్ కావడం లేదని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆఫీసర్లను ప్రశ్నించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులు చేపట్టిన స్కూళ్లలో కిచెన్ షెడ్లు, అడిషనల్ క్లాస్ రూమ్స్, టాయిలెట్స్, లెట్రిన్లు, కాంపౌండ్ వాల్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. జనవరి 7 నాటికి పనులను కంప్లీట్ చేయాలని , అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మీటింగ్ లో అడిషనల్ కలెక్టర్ అపూర్వ్ చౌహన్, డీఈవో సిరాజుద్దీన్, జడ్పీ సీఈవో విజయ నాయక్, వెల్ఫేర్ ఆఫీసర్ ముసాయిదా బేగం పాల్గొన్నారు.
ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
నెల్‌వర్క్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లాలోని పార్టీ నేతలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా, నియోజకవర్గం, మండల కేంద్రాల్లో పార్టీ జెండాలు ఆవిష్కరించి.. జై కాంగ్రెస్.. జై రాహుల్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం తెచ్చింది.. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. పేదరిక నిర్మూలనకు కృషి చేసింది.. సాగునీటి ప్రాజెక్టులు కట్టింది.. టెక్నాలజీ తీసుకొచ్చింది కూడా తమ పార్టీనని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్లు జి.మధుసూదన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, పటేల్ ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇన్‌చార్జి నాగం శశిధర్, కోస్గి మండల అధ్యక్షుడు రఘువర్దన్ రెడ్డి , నాయకులు రఘువర్ధన్ రెడ్డి , విజయ్ కుమార్ , కౌన్సిలర్లు తుడుం శీను, భాను నాయక్ , బెజ్జూ రాములు పాల్గొన్నారు.
ఆర్టీఐ చట్టాన్ని వినియోగించుకోవాలి
- ఆర్టీఐ కమిషనర్ గుగులోత్ శంకర్ నాయక్
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రాజ్యాంగం కల్పించిన సమాచారం హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్ సూచించారు. బుధవారం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో ఆర్టీఐ చట్టంపై నిర్వహించిన వర్క్ షాప్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. పాలనలో పారదర్శకత, అధికార యంత్రాంగంలో బాధ్యతను పెంపొందించేందుకు ఆర్టీఐ చట్టం అవసరమన్నారు. ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 8(3) ప్రకారం ప్రతి పౌరుడికి సమాచారం పొందే హక్కు ఉందన్నారు. ప్రభుత్వ శాఖలతో పాటు ప్రభుత్వం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం పొందుతున్న అన్ని రకాల సంస్థలు కూడా దీని పరిధిలోకి వస్తాయన్నాయి. పీయూకు గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారని, జీవితంలో లక్ష్యం పెట్టుకొని చదవాలని సూచించారు. పీయూ వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్, రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు, ఐక్యూ ఏసీ డైరెక్టర్, ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి, ప్రిన్సిపాల్ కిషోర్, పీఆర్వో అర్జున్ కుమార్ పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
- టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి
పెద్దమందడి, వెలుగు: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి కార్యకర్తలకు సూచించారు. బుధవారం పెద్దమందడి మండలం మోజర్లలో నిర్వహించిన ‘హాత్ సే హాత్ జోడో అభియాన్’ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చేందుకే బీఆర్‌ఎస్ అంటూ డ్రామాలు చేస్తున్నామని మడిపడ్డారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి జనవరి 26 నుంచి పాదయాత్ర చేపట్టనున్నారని తెలిపారు. కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలతో పాటు కాంగ్రెస్ గెలిస్తే చేపట్టబోయే కార్యక్రమాలు వివరించాలని సూచించారు. అధికారంలోకి రాగానే రూ.2లక్షల రైతు రుణమాఫీతో పాటు ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబంధం చేస్తామన్నారు. నకిలీ మందులు, విత్తనాల నియంత్రణకు కఠిన చట్టం తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్, నాయకులు మొగిలి సత్యారెడ్డి, కోట్ల రవి, గట్టు మన్యం, యాదయ్య శ్రీనివాస్, జగత్‌పల్లి పెంటన్న,రోహిత్,త్రినాథ్, భాస్కర్ పాల్గొన్నారు.
ప్లాన్ ప్రకారం గ్రామాల అభివృద్ధి
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
పెబ్బేరు, శ్రీరంగాపూర్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామాలను ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పారు. బుధవారం పెబ్బేరు పీహెచ్‌సీలో 42 మంది క్షయ పేషెంట్లకు నిత్యావసర కిట్లను పంపిణీ చేశారు. అనంతరం కంచిరావుపల్లిలో వనపర్తి,పెబ్బేరు రోడ్డు విస్తరణ పనులు, పెబ్బేరు పీహెచ్‌సీ వద్ద షాపింగ్ కాంప్లెక్స్, సూగూరులో ప్లేగ్రౌండ్‌కు శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తసూగూరులో అంగన్ వాడీ భవనం, ఈర్లదిన్నెలో స్కూల్ అదనపు గదులు, బూడిదపాడులో కామన్ కమ్యూనిటీ హాల్, అయ్యవారిపల్లి, తిప్పాయిపల్లి, శ్రీరంగాపూర్ మండలం జానంపేట, వెంకటాపూర్, కంబాళాపూర్ గ్రామాల్లో ఎస్సీ కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించారు. కబడ్డీ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అండర్–16 పోటీల్లో ప్రాతినిధ్యం వహించిన సూగూరు విద్యార్థులు ఎ.శ్రావణి, స్పందన, జి.శ్రావణిని అభినందించారు. ఆయా కార్యక్రమాలు మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతితో గ్రామాలు రూపు రేఖలు మారుతున్నాయని, మన ఊరు–మనబడితో స్కూళ్లను అందంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రజాప్రతినిధులు, నాయకులు కరుణశ్రీ, కర్రెస్వామి, ఆవుల శైలజ, పద్మ, రాధ, అక్కమ్మ, బచ్చారెడ్డి, సాయినాథ్, రాంబాబు, దిలీప్ కుమార్ రెడ్డి, కోదండరామిరెడ్డి, వెంకటేశ్, గాయత్రి పృథ్వీరాజ్,వెంకటేశ్వర్‌రెడ్డి, జగన్నాథం నాయుడు, వెంకటస్వామి, గౌడ నాయక్ తదితరులు పాల్గొన్నారు.