- బీజేఎల్పీ నేతగా మహేశ్వర్ రెడ్డి?
- గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం
- అందుకే ఇవాళ గవర్నర్ స్పీచ్ పై సమాధానం?
- పోటీలో లేనని తేల్చిన కామారెడ్డి ఎమ్మెల్యే
- మిగతా సభ్యులంతా కొత్తవారే కావడమే కారణం
హైదరాబాద్: బీజేపీ శాసనసభా పక్ష నేతగా నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఇవాళ ఆయనతో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్బంగా బీజేపీ పక్షాన సభలో మాట్లాడరనే చర్చ మొదలైంది. గతంలో రాజాసింగ్ శాసన సభా పక్ష నేతగా వ్యవహరించారు. అనంతరం ఆయన పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆ తర్వాత ఆ స్థానం ఖాళీగా ఉండిపోయింది.
ఈ సారి ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. ఇందులో గోషామహల్ నుంచి రాజాసింగ్, ఆదిలాబాద్ నుంచి పాయల్ శంకర్, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి హరీశ్ బాబు, నిర్మల్ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి రామారావు పటేల్, నిజామాబాద్ అర్బన్ నుంచి ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ నుంచి రాకేశ్ రెడ్డి, కామారెడ్డి నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నారు.
ఇందులో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి లకు మాత్రమే గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉంది. మహేశ్వర్ రెడ్డి 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున నిర్మల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాజాసింగ్ 2014, 2018,2023 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. కొన్ని వివాదాస్పదన వ్యాఖ్యల కారణంగా ఆయన సస్పెన్షన్ కు గురయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత బీజేపీ అధినాయకత్వం ఆయనపై వేసిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది. దీంతో ఆయన గోషామహల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
రాజాసింగ్ సీనియర్ శాసన సభ్యుడు అయినప్పటికీ తెలుగు భాష మీద పట్టు లేకపోవడం, హిందుత్వం తప్ప సమకాలీన పరిణామాలపై సమగ్రమైన అవగాహన లేకపోవడం కారణమని తెలుస్తోంది. దీనికి తోడు కీలక పదవులన్నీ హైదరాబాద్ నగరానికి సంబంధించిన నాయకులకే ఉన్నాయి. మరో పదవిని కూడా కట్టబెట్టకపోవచ్చని తెలుస్తోంది. దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు చోట్ల బీజేపీ విజయం సాధించడంతో ఆ జిల్లాకు చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నాయకుడిని చేస్తారని తెలుస్తోంది. అందుకే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడాలని బీజేపీ నాయకత్వం సూచించినట్టు తెలుస్తోంది.