అమీన్​పూర్​లో రెసిడెన్షియల్, నవోదయ స్కూల్స్ .. స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

అమీన్​పూర్​లో రెసిడెన్షియల్, నవోదయ స్కూల్స్ .. స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం (అమీన్​పూర్​), వెలుగు: సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్, నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు అమీన్​పూర్​ గోశాల పక్కన సర్వే నంబర్​ 993 లోని ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులకు అత్యాధునిక వసతులతో కూడిన కార్పొరేట్​ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే నవోదయకు 20 ఎకరాలు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యంగ్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​కు 20 ఎకరాలు, మినీ స్టేడియం కోసం మరో 5 ఎకరాలను కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసినట్లు వివరించారు. హైదరాబాద్ నగరానికి అతి చేరువలో ఉన్న అమీన్​పూర్​ ఏరియాలో ఇవి ఏర్పాటైతే అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్​ వెంకటస్వామి, మాజీ జట్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్​ చైర్మన్​ పాండురంగా రెడ్డి, మాజీ వైస్​చైర్మన్​ నర్సింహ గౌడ్, ఆర్ఐ రఘునాథ్​ రెడ్డి, గోపాల్, ఉపేందర్​రెడ్డి పాల్గొన్నారు.