మేం గాజులు తొడుక్కొని కూర్చోలే.. సరైన రీతిలో బుద్ధి చెబుతాం: MLA మహిపాల్ రెడ్డి

మేం గాజులు తొడుక్కొని కూర్చోలే.. సరైన రీతిలో బుద్ధి చెబుతాం: MLA మహిపాల్ రెడ్డి

సంగారెడ్డి: పఠాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్‎లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మె్ల్యే గూడెం మహిపాల్ రెడ్డి, కాటా శ్రీనివాస్ గౌడ్ మధ్య వర్గపోరు తాజాగా రోడ్డెక్కింది. మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గురువారం (జనవరి 23) కాటా శ్రీనివాస్ గౌడ్ అనుచరులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాటా అనుచరులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో  పటాన్ చెరు క్యాంప్ ఆఫీస్ ముట్టడిపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీరియస్‎గా రియాక్ట్ అయ్యారు. 

కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దుశ్చర్యను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. క్యాంప్ ఆఫీస్ ముట్టడించి ఫర్నీచర్‎ను ధ్వంసం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.  కాటా శ్రీనివాస్ గౌడ్‎కు అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఏంటో.. పార్టీ కార్యక్రమాలు అంటే ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపడం, దిష్టిబొమ్మలను తగలబెట్టడం అనేది  వాళ్ల హక్కు..  కానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించి ఫర్నీచర్ ధ్వంసం చేసే పద్ధతి సరైంది కాదని హితవు పలికారు. ఇవాళ ఒక గుండా.. ఒక రౌడీలా కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ మనుషులను ఉసిగొల్పారని మండిపడ్డారు. 

ALSO READ | లక్షా 32 వేల కోట్ల పెట్టుబడులు.. 46 వేల ఉద్యోగాలు : దావోస్ లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు

రాజకీయం చేయదలుచుకుంటే అభివృద్ధిలో పోటీ పడాలని అంతేకానీ ఇలా చిల్లర రాజకీయాలు చేయొద్దని సూచించారు. ఇవాల మీ అనుచరులు చేసిన పనికి మా మనుషులు స్పందిస్తే ఎలా ఉండేదో అర్థం చేసుకోవాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మేము గాజులు తోడుక్కొని కూర్చోలేదని.. సరైన సమయంలో సరైన రీతిలోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. క్యాంప్ ఆఫీసు అంటే ఒక ఇల్లు లాంటిదని.. అక్కడ ఏ ఫోటో పెట్టుకోవాలి, ఏది పెట్టుకోకూడదు అనేది నా ఇష్టమన్నారు. 35 సంవత్సరాల నుంచి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను చూశానని.. ఇలా వాటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నా అభివృద్ధి చూసే నన్ను మూడోసారి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు గెలిపించుకున్నారని అన్నారు.

 కాటా శ్రీనివాస్ గౌడ్ కనీసం సర్పంచిగా కూడా సరైన పద్ధతిలో పాలించలేకపోయాడని ఎద్దేవా చేశారు. నాపై రెండుసార్లు పోటీ చేసిన కాటా శ్రీనివాస్ గౌడ్‎ను ప్రజలు ఛీ కొట్టినా కూడా..  ఇంకా అతడి బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు చేసే పద్ధతి ఇలా కాదన్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్‎కు ఆవగింజంత కూడా రాజకీయ అనుభవం లేదని..  మొదట అది నేర్చుకోవాలని హితవు పలికారు. కాగా, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుఫున పఠాన్ చెరు ఎమ్మెల్యేగా గెలిచిన మహిపాల్ రెడ్డి.. ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో పఠాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు నడుస్తున్నాయి.