బిడ్డా లేరా.. కళ్లు తెరువురా.. కొడుకుని చూసి సొమ్మసిల్లిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

బిడ్డా లేరా.. కళ్లు తెరువురా.. కొడుకుని చూసి సొమ్మసిల్లిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

చెట్టంత కొడుకు.. చేతికి వచ్చిన కొడుకు.. కుర్రోడు.. ఎంతో చలాకీగా తిరిగేటోడు.. ఒక్కసారిగా లేడని తెలిసిన ఆ తండ్రి గుండె బద్దలైంది. పెద్ద జబ్బు కూడా ఏమీ కాదు.. పచ్చకామెర్లు వచ్చాయి.. జ్వరం వచ్చింది.. నాలుగు రోజుల తర్వాత ఇక ఆ బిడ్డ లేడని తెలిస్తే.. ఆ తండ్రి పరిస్థితి ఏంటీ..  ఇలాంటి బాధాకర పరిస్థితి ఇప్పుడు పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వచ్చింది. 

వారం క్రితం జాండీస్ రావటంతో ఆస్పత్రిలో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పెద్ద కుమారుడు.. 30 ఏళ్ల విష్ణువర్థన్ రెడ్డికి కిడ్నీలు ఫెయిల్ అయ్యి.. గుండెపోటుతో జులై 27వ తేదీ తెల్లవారుజామున కన్నుమూశారు. ఇంటికి వచ్చిన కుమారుడి పార్థివదేహాన్ని చూసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఒక్కసారిగా కుప్పకూలారు. బిడ్డా.. ఒక్కసారి లేరా.. కళ్లు తెరువురా అంటూ ఆ తండ్రి పడిన వేదన.. అక్కడున్న వాళ్లను కంట తడి పెట్టింది. కుమారుడిని విగతజీవిగా చూసి బోరున విలపించిన ఎమ్మెల్యే..  అక్కడే స్పృహ కోల్పోయారు. దీంతో ఆయనను వెంటనే ఇంట్లోకి తీసుకెళ్లి డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. 

కుమారుడు లేడన్న షాక్ లో ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని.. ఈ క్రమంలోనే స్పృహ తప్పారని.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు వైద్యులు. వారం క్రితం వరకు తమతోనే తిరిగిన విష్ణువర్థన్ రెడ్డి అలా విగత జీవిగా కనిపించటం.. మరో వైపు పెద్దన్నగా ఉన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అలా స్పృహ తప్పి పడిపోవటంతో.. ఆయన ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కార్యకర్తల ఆర్తనాదాలు మిన్నంటాయి.