హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసు హైకోర్టుకు చేరింది. తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మల్లారెడ్డి తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను తాము విచారణ చేపట్టబోమని జస్టిస్ సురేందర్ సోమవారం వెల్లడించారు. ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మాత్రమే ఈ కేసు విచారణ చేస్తారని స్పష్టం చేశారు.
మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో గిరిజనుల భూములు అన్యాక్రాంతం చేశారనే ఫిర్యాదు మేరకు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పోలీసులు ఇటీవల మల్లారెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే గిరిజనుల భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. దీనిని కొట్టేయాలని మల్లారెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ ఎదుట ఒకట్రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది.