![రైతుల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/mla-mamidala-yashaswini-reddy-said-governments-goal-is-to-see-happiness-in-the-eyes-of-farmers_Nhu7d8RoZX.jpg)
తొర్రూరు, వెలుగు: రైతుల కళ్లల్లో ఆనందం చూడడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో ఉన్నతాధికారులతో మాట్లాడి బయన్న వాగు రిజర్వాయర్ నుంచి పాలేరు వాగుకు నీటి విడుదల చేయించారు. బుధవారం ఎమ్మెల్యే కర్కాల చెక్ డ్యామ్ ను పరిశీలించి, పూజలు చేశారు.
వెలికట్ట శివారు పెద్ద మంగ్య తండా పరిధిలోని ఎస్సారెస్పీ కాలువ మధ్యలో పెద్ద బండ ఉండడంతో సాగునీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడడంతో రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే సొంత ఖర్చుతో పెద్ద బండ తొలగించే ఏర్పాట్లు చేయగా, పనులు పూర్తయ్యాయి. దీంతో రైతులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సాగునీరు అందించేందుకు అధికారులతో మాట్లాడి మైలారం రిజర్వాయర్ ద్వారా 8 చెక్ డ్యామ్ లను నింపుతున్నామన్నారు. రానున్న వేసవికాలంలో తొర్రూరు మున్సిపాలిటీ నీటి కొరత లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. పట్టణంలోని హరిపిరాల రోడ్డులోని తాగునీటి బావి, తొర్రూరు పెద్ద చెరువు వద్ద ఉన్న తాగునీటి బావులను సందర్శించారు. కార్యక్రమంలో తొర్రూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అనుమాండ్ల తిరుపతిరెడ్డి, కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.