ఎర్రబెల్లి తప్పుల వల్లే.. సాగునీటి సమస్య : మామిడాల యశస్వినిరెడ్డి

పాలకుర్తి, వెలుగు : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు నియోజక వర్గ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, ఆయన చేసిన తప్పుల వల్లనే ఇప్పుడు రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మిషన్​ భగీరథ గెస్ట్​ హౌస్​లో ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో కాంగ్రెస్​ నియోజక వర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి మాట్లాడారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయిందని అన్నారు. దేవరుప్పుల మండల రైతులకు సాగునీరు అందించేందుకు గత 15 రోజులుగా తాను ఎప్పటికప్పుడు ఇరిగేషన్​ ఉన్నతాధికారులతో మాట్లాడానని, నీళ్లు విడుదల అవుతున్న విషయం తెలుసుకున్న ఎర్రబెల్లి పంటల పరిశీలన పేరుతో ఫొటోలకు ఫోజులిచ్చారని ఆరోపించారు. 15 ఏండ్లుగా పాలకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి.. కనీసం రిజర్వాయర్​కు గేట్లు కూడా ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. 

ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ ఎర్రబెల్లి కాలువల్లో కనీసం మట్టికూడా తీయలేదని, కొన్ని ప్రాంతాలకు తమ సొంత ఖర్చులతో పైప్​లైన్​ ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం చేశామన్నారు. కాంగ్రెస్​ అంటేనే రైతుల ప్రభుత్వమని దేవాదుల ప్రాజెక్ట్​ను నిర్మించిన ఘనత కాంగ్రెస్​దే అని గుర్తు చేసారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ నియోజక వర్గ నాయకులు కాకిరాల హరి ప్రసాద్​, కేతిరెడ్డి నిరంజన్​ రెడ్డి, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండల పార్టి అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, పెద్ది కృష్ణమూర్తి గౌడ్​, సురేశ్​​ నాయక్​, బ్లాక్​ కాంగ్రెస్​ అద్యక్షులు రాపాక సత్యనారాయణ, అమ్యానాయక్​, జాటోతు నెహ్రూ తదితరులు ఉన్నారు.

తొర్రూరును మోడల్​ మున్సిపాలిటిగా తీర్చిదిదుతా

తొర్రూరు : తొర్రూరును రాష్ట్రంలోనే మోడల్​ మున్సిపాలిటీగా తీర్చిదిదుతానని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తెలిపారు. మంగళవారం మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో 2024– -25 బడ్జెట్ సమావేశాన్ని చైర్మన్ రామచంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. చీఫ్​గెస్ట్​గా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 39.19 కోట్ల బడ్జెట్​ను ప్రవేశపెట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎన్నమనేని శ్రీనివాసరావు. మున్సిపల్ ఏఈ రంజిత్, కౌన్సిలర్లు భూసాని రాము, తునం రోజా, తూర్పాటి సంగీత రవి, పేర్ల యమునా జంపా, దారావత్ సునీతజైసింగ్ పాల్గొన్నారు.