పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి : ఎమ్మెల్యే మందుల సామేల్​ 

తుంగతుర్తి, వెలుగు : గ్రామాల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్​ అధికారులకు సూచించారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో రోడ్డు భవనాలు, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో జాప్యానికి గల కారణాలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలను గుర్తించి త్వరగా పరిష్కరించాలని తెలిపారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులను పూర్తిచేయాలి

మోత్కూరు, వెలుగు : మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో టీయూఎఫ్ఐడీసీ  ఫండ్స్ తో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అధికారులకు సూచించారు. గురువారం మోత్కూరులో చైర్మన్ గుర్రం కవితలక్ష్మీనర్సింహారెడ్డి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెయిన్ రోడ్డు విస్తరణ పనులను త్వరగా చేపట్టాలని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కాంట్రాక్టర్లను తొలగించి కొత్తవారితో పనులు చేయిస్తామని హెచ్చరించారు.

డబుల్ రోడ్డు విస్తరణ పనుల కోసం ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసిందన్నారు. టీయూఎఫ్ఐడీసీ ఫండ్స్ కింద మంజూరైన మరో రూ.10 కోట్లతో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రపోజల్స్ తయారు చేయాలని ఆఫీసర్లకు సూచించారు. సమావేశంలో వైస్ చైర్మన్ బి.వెంకటయ్య, కమిషనర్ శ్రీకాంత్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.