చెత్తలో కూర్చొని ఎమ్మెల్యే నిరసన

చెత్తలో కూర్చొని ఎమ్మెల్యే నిరసన
  • శ్మశాన వాటికను డంపింగ్​యార్డుగా మార్చొద్దంటూ నినాదాలు

అల్వాల్, వెలుగు: అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారంలోని హిందూ శ్మశానవాటికను డంపింగ్ యార్డుగా మార్చొద్దంటూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి రెండో రోజైన సోమవారం నిరసనను కొనసాగించారు. డంప్​చేసిన చెత్తలో కూర్చొని ప్రభుత్వానికి, మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాత్కాలికం అంటూ హిందూ శ్మశాన వాటికను శాశ్వతంగా డంపింగ్ యార్డుగా మార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మచ్చబొల్లారం పరిధిలోని 50 కాలనీల ప్రజలు రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నా అధికారులు, ప్రభుత్వంలో చలనం లేకపోవడం దారుణమన్నారు. డంపింగ్ యార్డును తొలగించేవరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.