
అసెంబ్లీలో ఎమ్మెల్యే రాగమయి
సత్తుపల్లి, వెలుగు: కిష్టారంలోని అంబేడ్కర్ నగర్ లో సైలో బంకర్సమస్యకు బీఆర్ఎస్సే కారణమని ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆరోపించారు. గత ప్రభుత్వం వాటర్ టాంకర్ అని చెప్పి, అక్కడ సైలో బంకర్ నిర్మించిందన్నారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ తాత మధు మాత్రం ఇక్కడి కాలుష్యానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సైలో బంకర్కాలుష్య సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని కోరారు. మంగళవారం అసెంబ్లీలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు.
సీతారామ ప్రాజెక్ట్ నిర్వాసితులకు గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.15 కోట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహకారంతో అందించినట్లు పేర్కొన్నారు. పాత ఎన్ టీఆర్ కెనాల్ కే మరమ్మతులు చేసి, వినియోగించుకుంటే కొత్తగా భూసేకరణ చేసే పనుండదని, ప్రభుత్వానికి సుమారు రూ.200 కోట్ల ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచన చేశారు.