- రూ. 20 లక్షలు ఇవ్వాలని మేడిపల్లి సత్యంకు లండన్ నుంచి ఫోన్
- నిందితుడు బోడుప్పల్ కు చెందిన అఖిలేశ్ గా గుర్తింపు
- కేసు నమోదు.. లుక్ అవుట్ నోటీసులు జారీ
కరీంనగర్ క్రైం, వెలుగు : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు లండన్ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో +447886696497 నంబర్ నుంచి ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే సత్యంకు ఫోన్ చేశాడని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు. ఎవరైనా సహాయం కోసం ఫోన్ చేశారేమోనని భావించిన ఎమ్మెల్యే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడారని, దీంతో రూ. 20 లక్షలు ఇవ్వాలని అతడు బెదిరింపులకు పాల్పడ్డాడని తెలిపారు.
‘‘డబ్బులు ఇవ్వకపోతే రాజకీయంగా అప్రతిష్టపాలు చేసి నీ గౌరవానికి భంగం కలిగేలా చేస్తా. నీ ఇద్దరు పిల్లలను అనాథలయ్యేలా చేస్తా” అని ఎమ్మెల్యేను అతడు ఫోన్ లో బెదిరించినట్టు చెప్పారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు 339/2024 , భారతీయ న్యాయ సంహింత 308, 351(3), (4) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారని ఏసీపీ తెలిపారు. లండన్ నుంచి కాల్ చేసిన వ్యక్తిని రంగారెడ్డి జిల్లా బోడుప్పల్ భవానీ నగర్ కు చెందిన యాస అఖిలేశ్ రెడ్డి(33)గా గుర్తించామన్నారు. నిందితుడు ప్రస్తుతం లండన్ లోనే ఉన్నాడన్నారు. అతడి కోసం బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశామన్నారు.