అడ్డాకుల, వెలుగు: ప్రజా సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందరూ వినియోగించుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి కోరారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకులలో బుధవారం మండలంలోని కన్మనూర్, బలీద్ పల్లి, మహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక రాజ్యం పోయి ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అందరూ ప్రశాంతంగా ఉండాలని సూచించారు. ప్రజా పాలన గ్రామ సభల్లో దరఖాస్తులు అందజేసి లబ్ధి పొందాలన్నారు. తహసీల్దార్ ఘన్సిరాం నాయక్, డీటీ శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ భీమన్న యాదవ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, దశరథ్ రెడ్డి, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: నియోజకవర్గంలోని 213 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి పంపిణీ చేశారు. పట్టణంలోని ఓ గార్డెన్లో 5 మండలాల లబ్ధిదారులతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సేవ చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే తనను నేరుగా కలవాలని సూచించారు. ఇన్చార్జి ఆర్డీవో రామిరెడ్డి, జడ్పీటీసీలు సుమిత్ర, రోహిణి, కౌన్సిలర్లు శ్రీనివాసులు, నిజాముద్దీన్, సునేంద్ర పాల్గొన్నారు.