
రేవల్లి, వెలుగు: ఏదుల రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన కొంకలపల్లి గ్రామస్తులు 331 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు. బండరావిపాకుల గ్రామంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రిజర్వాయర్ కోసం ఇండ్లు, భూములు, ఊరు కోల్పోయిన నిర్వాసితులకు గత ప్రభుత్వంలో పునరావాసం కల్పించకుండా గాలికి వదిలేశారన్నారు.
18 ఏళ్లు నిండిన వారికి ఇండ్ల పట్టాలు త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. గ్యాస్ సబ్సిడీ పొందని వారి కోసం మండల అధికారులే గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్ ఈఈ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ లక్ష్మీదేవి, ఎంపీడీవో విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సత్య శీలా రెడ్డి, నాయకులు పర్వతాలు, పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.