గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు : మేఘా రెడ్డి

వనపర్తి, వెలుగు: నియోజకవర్గంలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో మార్పు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల ప్రజలతో ఆయన జూమ్ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఖిల్లా ఘనపురం ప్రాంతంలో గంజాయి ప్రభావం ఎక్కువగా ఉందని దీనివల్ల యువత ఎంతో నష్టపోతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పెబ్బేరు, శ్రీరంగాపూర్ మండలాల్లో రోడ్ల నిర్మాణాలు, బస్సు సౌకర్యం పీహెచ్ సీ లలో సిబ్బంది నియామకాలు, శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మరమ్మతులు చేపట్టాలని కోరినట్లు తెలిపారు.

 పెద్ధమందడి లో ఎస్​బీఐ ఏటీఎం ఏర్పాటు చేయాలని, పీహెచ్ సీ ని ఊరు అవతల ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని దీనిపై దృష్టి సారిస్తామన్నారు. రోడ్లు, విద్య, వైద్యం పై ప్రత్యేక దృష్టి పెడతామని ఎమ్మెల్యే అన్నారు. వనపర్తి నియోజకవర్గంలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని దీనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ, ఇతర పోలీసులను ఆదేశిస్తామని అన్నారు.

 అనంతరం పెద్దమందడి మండలం అల్వాల్ గ్రామంలో జగద్గురు వీరబ్రహ్మేంద్రస్వామి గోశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సువర్ణ జగన్మోహన్ రెడ్డి, ఉప సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, రాజమహేందర్ రెడ్డి, సరితా తిరుపతిరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.