గోదావరిఖని, వెలుగు: మాజీ నక్సలైట్లు వ్యవసాయం చేసుకునేందుకు ప్రభుత్వ భూములు ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ కోరారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్‌లో కలెక్టర్ కోయ శ్రీహర్షను ఎమ్మెల్యే కలిసి పలు అంశాలపై చర్చించారు. మాజీ నక్సలైట్లు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి భూములు కేటాయించాలన్నారు.
సింగరేణి ప్రభావిత, ముంపు గ్రామాల నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని త్వరగా అందజేయాలన్నారు. అంతకుముందు పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలోని ఎస్సీ హాస్టల్‌ను ఎమ్మెల్యే సందర్శించారు. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థులకు తగిన సౌకర్యాలు సమకూర్చాలని వార్డెన్‌ను ఆదేశించారు.