- అధికారుల్లో జవాబుదారీతనం లేదని సభ్యుల ఆవేదన
- కరెంటు బిల్లుల అధిక వసూళ్ల పై కలెక్టర్‌కు ఫిర్యాదు
- మిషన్ భగీరథ వరల్డ్ రికార్డ్: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
- మన ఊరు–మన బడి ప్రతిష్టాత్మకం : ఎమ్మెల్యే రాజయ్య
జనగామ, వెలుగు: జనగామ జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ లో సభ్యులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ మీటింగ్‌హాల్‌లో శనివారం చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్జరగగా ముఖ్య అతిథులుగా జనగామ, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ సమస్యలను విన్నవించారు. అధికారుల్లో జవాబుదారీతనం లేదన్నారు. లింగాల ఘన్పూర్ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి.. మాట్లాడుతూ వ్యవసాయ కనెక్షన్లకు జిల్లాలోని ఇతర మండలాల్లో ఏడాదికి రూ.360 వసూలు చేస్తుంటే.. తన మండల పరిధిలో మాత్రం రూ.720 వసూలు చేస్తున్నారని రశీదులతో సహా కలెక్టర్ శివలింగయ్యకు ఫిర్యాదు చేశారు. రఘునాథపల్లి, దేవరుప్పుల ఎంపీపీలు మేకల వరలక్ష్మీ, బస్వ సావిత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లో రేషన్ కార్డుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. కొత్త కార్డుల అందజేత, పాత కార్డుల్లో సవరణలను వెంటనే చేపట్టాలని కోరారు. రోగాలతో వరి నాట్లు చనిపోతున్నాయని తరిగొప్పుల జడ్పీటీసీ ముద్దసాని పద్మజా రెడ్డి తెలుపగా.. డీఏవో వినోద్ కుమార్ స్పందించి, నష్ట నివారణకు అవసరమైన చర్యలు చేపడుతామన్నారు.
మిషన్ భగీరథ వరల్డ్ రికార్డ్..
మిషన్ భగీరథ పథకం వరల్డ్ రికార్డ్ అని, భగీరథ నీళ్లను అధికారులు, ప్రజాప్రతినిధులు తాగి, ప్రజలు తాగేలా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.. అక్కడక్కడ డిజైన్ లోపంతో ట్యాంకులకు నీళ్లు ఎక్కించే పైపుల సామర్థ్యం తక్కువగా ఉందన్నారు. రాబోయే ఎండాకాలం నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకువాలని మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్ ను ఆదేశించారు. బడి, గుడి, మసీదు, చర్చిలకు సైతం నల్లా కనెక్షన్లు ఇవ్వాలన్నారు. ట్రాన్స్‌కో ఆఫీసర్లు లోఓల్టేజ్ సమస్యను తీర్చాలన్నారు. డీడీలు కట్టి ఎదురు చూస్తున్న రైతులకు వెంటనే పోల్స్ అందించి,సరఫరా మెరుగుపరచాలన్నారు. వ్యవసాయ మోటారు కనెక్షన్లకు అధిక సర్వీస్చార్జీలను వసూలు చేయవద్దన్నారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాట్లాడుతూ..‘కంటి వెలుగు’లో అత్యధిక మందికి పరీక్షలు చేసి గిన్నీస్ బుక్ రికార్డు సాధించాలన్నారు. ‘మన ఊరు–మన బడి’ కింద ఎంపిక చేసిన స్కూళ్లలో పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలలో పెండింగ్‌పనులు లేకుండా చూసుకోవాలన్నారు. కలెక్టర్ శివలింగయ్య మాట్లాడుతూ.. జిల్లాలోని 26 సెంటర్లలో ప్రతిరోజూ 150కి తగ్గకుండా కంటి పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు దీనిని మరింత విజయవంతం చేయాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.. జిల్లాలోని 109 కొత్త జీపీ బిల్డింగ్‌ల నిర్మాణానికి గాను మొదటి దశలో 75 జీపీలకు నిధులు మంజూరు అయ్యాయన్నారు.మిగిలిన 34 జీపీలకు రెండో దశలో మంజూరు కానున్నాయన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో వసంత, జడ్పీటీసీలు, ఎంపీపీలు తదితరులున్నారు.
బీజేపీ, కాంగ్రెసోళ్లపై తిరగబడాలె
ఊర్లోకి బీజేపీ, కాంగ్రెసోళ్లు వస్తే తిరగబడాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం జనగామ మండలం గానుగుపహాడ్‌లో రూ. 1.5 కోట్లతో చేపట్టిన సీసీ, బీటీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. విపక్ష లీడర్లపై తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ లీడర్లపై తిట్ల దండకం మొదలు పెట్టారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పచ్చబడడాన్ని ఓర్చుకుంటలేరన్నారు. కేంద్రం పైసలు ఇస్తలేదని, రాష్ట్రంలో నిధుల కొరత ఉందన్నారు. ఇక్కడ పైసలు ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్‌లకు వెళ్తున్నాయని ఆరోపించారు. ‘మన పైసలు మనకు రావాలె గానీ గటెట్ల పోతయ్, అడగాలె.. ఎక్కడికక్కడ నిలదీయాలె’ అని అన్నారు.