నర్మెట్ట, వెలుగు: జనగామ టికెట్ మూడో సారి కూడా తనకే వస్తుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జనగామ జిల్లా నర్మెట్టలో మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ కోటిరెడ్డితో కలిసి హాజరయ్యారు. ముత్తిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే కేంద్రం నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శిచారు.
ఉద్యమకాలంలో టీఆర్‌ఎస్ తరఫున పనిచేసిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి నియోజకవర్గ ఆత్మగౌరవాన్ని వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి అమ్మేశాడని ఆరోపించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నాడో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండి.గౌస్, కమలాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఆగిరెడ్డి పాల్గొన్నారు.