కొమురవెల్లి, వెలుగు : తెలంగాణలో అభివృద్ధి జరగలేదని రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిరూపిస్తే.. జీవితాంతం గోసి గొంగడితో ఉంటానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగరిరెడ్డి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. సోమవారం కొమురవెల్లి మండలంలోని కిష్టంపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీలుగా ఉన్న రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డికి ధైర్యం ఉంటే రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకురావాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సోయి ఉంటే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన
ఏదైనా ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తావో లేవో చెప్పాలని ప్రశ్నించారు. ఒకప్పటి తెలంగాణ, ఇప్పటి తెలంగాణ వేరని సీఎం కేసీఆర్ అన్ని పథకాలు కలిపి ఒక్కో ఊరికి ఆరేడు కోట్లు ఇస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు మరోసారి అవకాశం కల్పించాలని సభ ముఖంగా చేతులు ఎత్తి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కరుణాకర్, ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్దప్ప, ఉప సర్పంచ్ అయిలయ్య, ఎంపీటీసీ దుర్గారెడ్డి, రవీందర్ పాల్గొన్నారు