
- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
చేర్యాల, వెలుగు : చేర్యాల కేంద్రంగా జ్యూడిషియల్ మున్సిఫ్ కోర్టును తీసుకువచ్చామని, రెవెన్యూ డివిజన్ ను కూడా అలాగే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలిపారు. మున్సిఫ్ కోర్టు మంజూరైన సందర్భంగా బుధవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్ల కోరికయిన మున్సిఫ్ కోర్టును సాధించుకోవడంతో ఆనందంగా ఉందన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కూడా త్వరలో జరుగుతుందని తెలిపారు. చేర్యాల మున్సిపల్ కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు రూ. 73 కోట్లను కేటాయించినట్లు తెలిపారు.
నాలుగు మండలాల్లో దాదాపు రూ. 20 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రూ.3 కోట్లతో చేర్యాల పెద్ద చెరువు మత్తడి కాలువ నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఈ ప్రాంత లాయర్లు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీలు బి. కృష్ణారెడ్డి, ఉల్లంపల్లి కర్ణాకర్, తలారి కీర్తన, కొమురవెల్లి టెంపుల్ కమిటీ చైర్మన్ గీస భిక్షపతి, మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.