
- మల్కాజ్గిరి ఎమ్మెల్యే హనుమంతరావు
- చిలుముల సుహాసినిరెడ్డి, శేషసాయిరెడ్డితో భేటీ
- కాంగ్రెస్ పార్టీలోకి రావాలని వారికి ఆహ్వానం
కౌడిపల్లి, వెలుగు : ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయమని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. ఈసారి సైలెంట్ ఓటింగ్ జరుగనుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80 సీట్లు తగ్గకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డితో కలిసి కౌడిపల్లిలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిలుముల కిషన్ రెడ్డి భార్య, ఉమ్మడి మెదక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి, ఆమె కొడుకు చిలిపిచెడు మాజీ జడ్పీటీసీ శేష సాయి రెడ్డి ఇంటికి వెళ్లారు. వారిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అనంతరం హన్మంతరావు వారితో కలిసి మీడియాతో మాట్లాడారు. చిలుముల సుహాసిని రెడ్డి, శేషసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తగిన స్థానం ఇచ్చి అండగా ఉంటామన్నారు.
గతంలో సీపీఐ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన విఠల్ రెడ్డి తో తనకు తండ్రి సమానులుగా ఉండేవారు, ఎప్పుడు కలిసినా ఎంతో ఆప్యాయంగా పలుకరించే వారని గుర్తు చేశారు. గతంలో తాను సామ్రాట్ స్పిన్నింగ్ మిల్స్ కార్మిక సంఘం ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పూర్తి మద్దతు తెలిపి తన గెలుపుకోసం ప్రచారం చేశారన్నారు. టీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల్లో సుహాసినిరెడ్డికి టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. తగిన ప్రాధాన్యత ఇస్తమని చెప్పినా ఏ పదవి ఇవ్వలేదన్నారు. శేష సాయి రెడ్డి అమెరికా నుంచి వచ్చి చిలప్ చెడ్ జడ్పీటీసీ మెంబర్గా గెలిచినప్పటికీ పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం లేక మూడున్నరేళ్లకే పదవికి, పార్టీకి రాజీనామా చేశారన్నారు. సుహాసినిరెడ్డి, శేషసాయిరెడ్డి కాంగ్రెస్ లోకి వస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, వారికి సముచిత స్థానం దక్కుతుందన్నారు.
23 ఏళ్లుగా అవమానమే..
బీఆర్‌ఎస్‌లో తమకు 23 ఏళ్లుగా తమ కుటుంబానికి అవమానాలే ఎదురవుతున్నాయని స్వర్గీయ కిషన్ రెడ్డి భార్య చిలుముల సుహాసినిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. భరించలేకనే శేషసాయిరెడ్డి జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశాడన్నారు. కార్యకర్తలతో చర్చించి వారి సూచన మేరకే నిర్ణయం తీసుకుంటామన్నారు. శేషసాయిరెడ్డి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశామని, హైకమాండ్ ఇచ్చిన మాట తప్పిందన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ ఇంటికి వచ్చి ఆహ్వానించడం సంతోషకరమన్నారు. టీపీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, కౌడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నర్సాపూర్ మండల అధ్యక్షుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.