
- బీఆర్‌ఎస్ సభ కోసం ఎల్కతుర్తిలో పెద్దవాగు, దేవాదుల కాల్వలు పూడ్చివేత
- ఎల్కతుర్తిలో కాల్వలు పరిశీలించి వివరాలు సేకరించిన ఆఫీసర్లు
- కాల్వలు పూడుస్తుంటే ఏం చేస్తున్నారని ఇరిగేషన్ ఆఫీసర్లపై మండిపడ్డ ఎమ్మెల్యే నాగరాజు
హనుమకొండ/ఎల్కతుర్తి, వెలుగు : ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సమీపంలో నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కోసం కాల్వలు పూడ్చివేస్తున్న ఘటనపై మీడియాలో కథనాలు రావడంతో అధికార యంత్రాంగం కదిలింది. కలెక్టర్‌తో పాటు రెవెన్యూ, ఇరిగేషన్, దేవాదుల ఆఫీసర్లు సోమవారం మధ్యాహ్నం ఎల్కతుర్తి బీఆర్‌ఎస్ సభ ఆవరణలోని పెద్దవాగు, దేవాదుల కాల్వలను పరిశీలించారు. దేవాదుల ఈఈ సీతారాంనాయక్, డీఈ ప్రశాంతి, ఏఈ మంజుల, తహసీల్దార్ జగత్ సింగ్, ఆర్‌ఐ సదానందం, ఇతర ఆఫీసర్లు కలిసి దేవాదుల డీ3, డీ6-1 ఆర్, 2 ఆర్ కాల్వలను పరిశీలించారు.
పూడ్చివేసిన స్థలం వద్ద కొలతలు వేసి వివరాలు నోట్ చేసుకున్నారు. మొత్తం వంద మీటర్ల మేర కాల్వలను పూడ్చివేసినట్లు గుర్తించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆఫీసర్లు వివరాలు సేకరిస్తున్న క్రమంలో బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు అక్కడికి వచ్చి, సభ పూర్తైన 24 గంటల్లో కాల్వలను క్లీన్ చేసి ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆఫీసర్లు పేర్కొన్నారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ పార్కింగ్ అవసరాల కోసం ఎల్కతుర్తి సమీపంలోని పెద్దవాగు, దేవాదుల కాల్వలను పూడుస్తున్న నేపథ్యంలో మీడియాలో వచ్చిన కథనాలకు ప్రజాప్రతినిధులు స్పందించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలతో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు సోమవారం స్థానిక నేతలతో కలిసి ఎల్కతుర్తి సభా ప్రాంగణంలోని పెద్దవాగు, దేవాదుల కాల్వలను పరిశీలించారు. అనంతరం అక్కడి పరిస్థితిని మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వివరించారు.
తర్వాత హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీవో రాథోడ్ రమేశ్, మైనింగ్ ఆఫీసర్లతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కోసం విచ్చలవిడిగా కాల్వలు పూడుస్తుంటే మీరు ఏం చేస్తున్నారు ? వాగులు, కాల్వలను పూడ్చేస్తున్నా పట్టించుకోరా ? కళ్లు మూసుకుని పని చేస్తున్నరా ?’ అంటూ ఇరిగేషన్ ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పర్మిషన్‌తో వేలాది ట్రిప్పుల మొరాన్ని తరలిస్తున్నారని ప్రశ్నించారు.
తమకేమీ తెలియదని ఆఫీసర్లు సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఆఫీసర్లు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ సభ నిర్వహణకు మాత్రమే పర్మిషన్ ఉందని, అనుమతి లేకుండా వాగులు, కాల్వలు పూడ్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు.
క్వారీ యజమానిని కౌశిక్‌రెడ్డి బెదిరిస్తున్నడు : కేఆర్.నాగరాజు
బీఆర్‌ఎస్ మీటింగ్ కోసం రూ. 50 లక్షలు ఇవ్వాలని ఓ క్వారీ యజమానిని హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నాడని, డబ్బులు ఇవ్వకపోతే క్వారీ ఎలా నడుస్తుందో చూస్తానంటూ బెదిరిస్తున్నాడని ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ఆరోపించారు. ఎల్కతుర్తిలో కాల్వలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు అడ్డుపడుతున్నారంటూ కాంగ్రెస్‌పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే ప్రజల కోసమని, కాంగ్రెస్ హయాంలో ధర్నా చేసుకునే అవకాశం సైతం కల్పించామన్నారు. పోలీసులు పర్మిషన్లు ఇస్తున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్నారు. సభ నిర్వహణకు తమ నుంచి సంతకాలు తీసుకొని, ఇష్టం వచ్చినట్లు కాల్వలు ధ్వంసం చేస్తున్నారని స్థానిక రైతులు ఫిర్యాదు చేశారని చెప్పారు. అనంతసాగర్, ఎల్కతుర్తి సరిహద్దును కూడా చెరిపేశారని ఆరోపించారు. పూడ్చిన కాల్వలను సరి చేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.