-
వరంగల్‌ను ముక్కలు చేస్తే వినయ్ ప్రశ్నించలేదెందుకు?
-
బీఆర్‍ఎస్ నేతలపై ఎమ్మెల్యే నాయిని ఫైర్
-
ఉద్యమకారుల గుర్తింపుకు కూరపాటి నేతృత్వంలో కమిటీ
వరంగల్, వెలుగు : కాకతీయ కళాతోరణం గురించి మాట్లాడుతున్న బీఆర్‍ఎస్ వరంగల్‌మాజీ ఎమ్మెల్యేలు పదేండ్ల పాలనలో కాకతీయ ఉత్సవాలు ఎందుకు నిర్వహించలేదని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం నయీంనగర్‍లో రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, పలువురు మేధావులతో కలిసి ప్రెస్‍మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. కాకతీయుల చరిత్రను అణగదొక్కేలా ఓరుగల్లును ఆరు ముక్కలు చేస్తే..అప్పటి బీఆర్‍ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదని ఫైర్ అయ్యారు. చరిత్ర కలిగిన వరంగల్ సెంట్రల్ జైల్ కూల్చుతుంటే.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ జోన్ తీసేసి భద్రాద్రిలో కలుపుతుంటే.. నగరంలోని ఆర్టీసీ టైర్ రిట్రేడింగ్ సెంటర్ తరలిస్తుంటే కనీసం మాట్లాడని వినయ్ భాస్కర్, కేటీఆర్ మరో ఉద్యమం ప్రారంభిస్తామని మాట్లాడటం సిగ్గుచేటన్నారు.
ఓరుగల్లు కేంద్రంగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని తెలంగాణ రాజముద్రలో తొలగించవద్దని బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా ప్రజల తరఫున సీఎంకు చెప్పామన్నారు. జూన్ 3న హంటర్ రోడ్‌లోని డీ కన్వెన్షన్ హాల్‍లో పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను సన్మానించనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ నేతృత్వంలో ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్, మాజీ కార్పొరేటర్లు అబూబాకర్, బోడ డిన్నా, రహీమున్నిసా బేగం, నారాయణరెడ్డి, దారం జనార్దన్, జైసింగ్ రాథోడ్, సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ , మంద వీరస్వామి పాల్గొన్నారు.