- నాలుగు నెలల్లోగా నాలా విస్తరణ పనులు
- పార్టీలకతీతంగా ప్రోటోకాల్ పాటించాలి
హనుమకొండ:‘సిటీలో మా నాన్న ఆక్రమణ ఉన్నా తీసేయాల్సిందేనని ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చాం’ అని వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చెప్పారు. హన్మకొండలోని నయీమ్ నగర్ నాలా(పెద్ద మోరీ)పై రూ.8.5 కోట్ల బ్రిడ్జి డెవెలప్మెంట్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ ఎవరి ఆక్రమణలో ఉన్నా అధికారులు ఊరుకోవద్దన్నారు.
వరంగల్ నగరంలో చెరువులు, కుంటలు కబ్జాలను ఉపేక్షించేది లేదన్నారు. కబ్జాదారులు వెంటనే ఆ భూములను ఖాళీ చేయాలని సూచించారు. లేదంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాలంటరీగా ఎవరికివారు ఆక్రమణలు తొలగించుకుంటే మంచిదన్నారు. ఇప్పటికే ఆక్రమణల తొలగింపు విషయంలో చాలా ఒత్తిళ్లు వచ్చాయని తెలిపారు.
నాలా ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అందులో అధికారులతో పాటు పార్టీలకతీతంగా అందరినీ భాగస్వామ్యం చేస్తామని ఆయన తెలిపారు. నాలుగు నెలల్లోగా నాలా విస్తరణ పనులు పూర్తి చేయాలని ఆధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా నిర్వహించే కార్యక్రమాల్లో పార్టీలకతీతంగా ప్రోటోకాల్ పాటించాలని ఆఫీసర్లకు సూచించారు.