కేయూపై సీఎం ప్రత్యేక దృష్టి

హసన్ పర్తి, వెలుగు : గత ప్రభుత్వంలో పాలకులు తమ రాజకీయ స్వలాభాల కోసం ప్రభుత్వం యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి చేతుల్లో పెట్టారని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మడ్డిపడ్డారు. శనివారం వరంగల్ ఎంపీ కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవురి ప్రకాశ్ రెడ్డి కాకతీయ విశ్వవిద్యాలయంలో వీసీ ప్రతాప్ రెడ్డి, రిజిస్టర్ మల్లారెడ్డి, పాలక వర్గం ఆధ్వర్యంలో యూనివర్సిటీ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల సుదీర్ఘ, సమకాలిక సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు.

 అనంతరం కేయూ గెస్ట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడారు. తాము ఎమ్మెల్యేలు గా గెలిచిన తర్వాత కలసికట్టుగా జిల్లాలో ప్రధానంగా ఉన్న గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్, ఎంజీఎం దవాఖాన, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రక్షాళనపై దృష్టి సారించినట్లు చెప్పారు. కాకతీయ యూనివర్సిటీ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ పెట్టారన్నారు. 

డెవలప్మెంట్, విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు డీపీఆర్ రెడీ చేసి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. డిసెంబర్​23న మళ్లీ సమీక్ష నిర్వహించి అన్ని రకాల అంశాలపై పూర్తి నివేదికలతో సమావేశం ఉంటుందన్నారు. అనంతరం కామన్ మెస్ లో విద్యార్థులతో కలిసి బోజనం చేశారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అనీతా రెడ్డి, చిర్ర రాజు, సురేశ్ లాల్, రమ, పుల్లూరు సుధాకర్, సుదర్శన్ తదితరులు  పాల్గొన్నారు.