- సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే భాస్కర్ రావుకు నిరసన
- మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భర్తీని ఆలస్యం చేస్తుండ్రని ఆగ్రహం
- ఉబ్బపల్లి సోములు ఫ్యామిలీ కి కేటాయించాలని డిమాండ్
- సమన్వయ చేసి పాలకవర్గం ఏర్పాటు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావుకు నిరసన సెగ తగిలింది. మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి భర్తీని కావాలనే ఆలస్యం చేస్తున్నారని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిర్యాల గూడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్ కాగా...ఆ పదవిని భర్తీ చేసేందుకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నిలదీశారు. ఇటీవల స్థానిక గాంధీనగర్ లో బస్తీ దావఖాన ప్రారంభం సమయంలోనూ ఈ విషయంపై ప్రస్తావిస్తే.. దాటవేశారని గుర్తు చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయాలంటూ ఎస్సీ సామాజిక వర్గం నేతలు ఎమ్మెల్యే భాస్కర్ రావును నిలదీయటం మిర్యాల గూడ పట్టణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
మిర్యాలగూడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవి భర్తీ చేయడంపై వివక్ష చూపుతున్నారని బీఆర్ఎస్ ఎస్సీ సామాజిక వర్గం నేతలు ఆరోపించారు. 2019లో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి జనరల్ కు రిజర్వు కాగా... చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డిని నెల రోజుల్లో నియమించారని గుర్తు చేశారు. కానీ 2021 ఆగస్టులో పాలకవర్గం గడువు పూర్తయిన ఇప్పటి వరకు ఎందుకు భర్తీ చేయలేదో వెల్లడించాలని డిమాండ్ చేశారు. నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ నేపథ్యం కలిగిన సీనియర్ నేత ఉబ్బపల్లి సోములు మాదిగకు .. లేదా ఆ ఫ్యామిలీకి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిని ఇవ్వాలని నినాదాలు చేశారు. పాలకవర్గం సభ్యులు నిలదీయడంతో ఎమ్మెల్యే భాస్కర్ రావు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. త్వరలోనే చైర్మన్ పదవి భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.