వరంగల్, వెలుగు: దళిత యువతిపై రేప్, బెదిరింపుల ఘటనలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఆయన బంధువుల హస్తం ఉందని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ లీడర్లు ఆరోపించారు. దీనిపై ఉన్నతస్థాయిలో సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎంజీఎం జంక్షన్‍లో, బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ధర్నా దిగారు. ఎమ్మెల్యేతో పాటు ఇలాంటి నేతలను కాపాడుతున్నారంటూ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఎమ్మెల్యే అండతోనే అఘాయిత్యం: కొండా సురేఖ
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అండతోనే ఆయన పీఏ శివ దళిత అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని మాజీ మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ వరంగల్, హన్మకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‍రెడ్డి, కొండా మురళి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య మండిపడ్డారు. శుక్రవారం ఎంజీఎం జంక్షన్‍లో ధర్నా చేసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అధికార పార్టీ పెద్దల హస్తం ఉన్నందునే కేసును త్వరగా క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కొండా సురేఖ మండిపడ్డారు. కాగా, అధికార బలంతో టీఆర్‍ఎస్ నేతలు యువతుల జీవితాలతో అడుకుంటున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఫైర్ అయ్యారు. బాధితురాలు ఉండే హన్మకొండ బాలసముద్రంలోని హాస్టల్‍ను ఆమె సందర్శించారు. ఎమ్మెల్యే నరేందర్ పీఏ, బంధువులే హాస్టల్ నడుపుతున్నారని, మొత్తం ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి ఎంతటివారున్నా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వరంగల్ చౌరస్తాలో బీజేపీ ఆందోళన
దళిత అమ్మాయిని రేప్ చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఇదే అంశమై బీజేపీ శ్రేణులు వరంగల్ చౌరస్తాలో ఎమ్మెల్యే నరేందర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడుతుంటే ప్రభుత్వ పెద్దలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ఎమ్మెల్యే పీఏ శిశతో పాటు అతనికి సహకరించిన పార్టీ పెద్దలను దోషులుగా చేర్చాలన్నారు. కాగా, దళిత యువతిపై రేప్ ఘటనలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్, ఆయన బంధువుల హస్తం ఉందని బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‍రావు ఆరోపించారు. ప్రభుత్వ వెంటనే ఎంక్వయిరీకి ఆదేశాలిచ్చి, అసలు నిందితులను బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రేప్ కేసులో ముగ్గురు రిమాండ్
సిద్ధిపేట జిల్లాకు చెందిన ఓ దళిత యువతి బాలసముద్రం ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఎల్‍ఎల్‍బీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. హాస్టల్ వార్డెన్ సాయంతో విజయ్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పీఏ వేముల శివ అనే వ్యక్తులు యువతిని పలుమార్లు బెదిరించి రేప్చేశారు. ఫొటోలు తీసి వైరల్ చేస్తామంటూ హింసిస్తున్నారు. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఎమ్మెల్యే పీఏ శివ, విజయ్‍తో పాటు హాస్టల్ వార్డెన్ శోభపై పోలీసులు 506, 376, 109 సెక్షన్ల కింద రేప్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి రిమాండ్‍కు తరలించారు. కేసు తీవ్రత దృష్ట్యా సీపీ తరుణ్‍జోషి.. హన్మకొండ ఏసీపీ కిరణ్‍కుమార్ కు అప్పగించడంతో దర్యాప్తు చేస్తున్నారు.