- కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జువ్వాడి
మల్లాపూర్ , వెలుగు : అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నర్సింగారావు అన్నారు. మండలంలోని ముత్యంపేట్ లో సుమారు 1400 మంది బీఆర్ఎస్, బీజెపి కార్యకర్తలు నర్సింగరావు ఆధ్వర్యంలో బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నర్సింగరావు మాట్లాడుతూ.... 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో నిజం షుగర్ ఫ్యాక్టరీలను ప్రభుత్వ పరం చేసుకొని ఫ్యాక్టరీని నడిపిస్తామని కేసీఆర్ ప్రకటించి చెరుకు రైతులను మోసం చేశారని గుర్తు చేశారు.
స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిజం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని లేకుంటే ఫ్యాక్టరీ ముందు ఉరివేసుకుంటానని హామీ ఇచ్చి గత 15 ఏండ్లుగా నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ముత్యంపెట్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఆరు హామీలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పుండ్ర శ్రీనివాస్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ జలపతి రెడ్డి , కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి పాల్గొన్నారు.