వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో భూకబ్జాకు గురైన స్థలాలుంటే వెంటనే వివరాలు తన దృష్టికి తీసుకురావాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధ్యక్షతన కలెక్టరేట్లో నియోజకవర్గ అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించారు. గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే, ఆర్టీసీ ఆర్‍ఎం విజయభాను పాల్గొన్నారు.
ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో మాస్టర్ ప్లాన్‍కు అనుగుణంగా ప్రధాన మార్గాల్లో రోడ్డుకు ఇరువైపులా విస్తరణ పనులు చేపట్టాలన్నారు. రోడ్డు విస్తరణలో ఇండ్లు ఉన్నవారికి డబుల్ బెడ్‍రూం ఇండ్లు మంజూరు చేయాలన్నారు. పోతన నగర్ రోడ్ వెడల్పు, భద్రకాళి ఆలయ పార్కింగ్, పెదమ్మగడ్డ చివర్లో రోడ్డు విస్తరణ పరిశీలించాలని, బాధితులు ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్మార్టీ సిటీ పనుల్లో భాగంగా చేపడుతున్న భద్రకాళి, వడ్డేపల్లి బండ్ పనులను వేగవంతం చేయాలన్నారు.
ఈ ప్రాంతంలో ఓపెన్ జిమ్‍లు ఏర్పాటు చేయడంతో పాటు ఇప్పటికే వివిధ పార్కుల్లో ఉన్న ఓపెన్ జిమ్ పరికరాలకు రిపేర్లు చేయాలన్నారు. జీడబ్ల్యూఎంసీ, ఆర్టీసీ బస్టాండ్, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆవరణల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. కాజీపేట సోమిడి, హంటర్‍రోడ్‍లోని విష్ణుప్రియ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో పారదర్శకంగా ఉండాలని ఆదేశించారు.