గడువులోగా పనులు పూర్తి చేయాలి :  ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి 

గడువులోగా పనులు పూర్తి చేయాలి :  ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి 

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు : అభివృద్ధి పనులను అనుకున్న గడువులోగా పూర్తి చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ (కుడా) సమావేశ మందిరంలో ఆయన బల్దియా మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీతో కలిసి పశ్చిమ నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే, మేయర్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని డివిజన్లకు 2023 జనవరి నుంచి రూ.66 కోట్ల 51 లక్షలతో 647 అభివృద్ధి పనులు మంజూరు కాగా, ఇప్పటివరకు రూ.19 కోట్ల 62 లక్షలతో 379 పనులు పుర్తై, రూ.13 కోట్ల 46 లక్షల 62 పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 32 పనులకు అగ్రిమెంట్ పూర్తయినా, 86 పనులకు వెంటనే టెండర్లు పూర్తి చేసి, మిగిలిన 85 పనులను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. నగరంలో ప్రధాన రహదారులను వ్యాపారస్తులు ఆక్రమించుకోవడం వల్ల ట్రాఫిక్ కు, ప్రజా రవాణాకు ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా మున్సిపల్, రెవెన్యూ, ట్రాఫిక్ పోలీసు అధికారులు సమన్వయంతో సమస్య పరిష్కరించాలన్నారు.

నగరంలోని కాజీపేట సోమిరెడ్డి గోపాలపురం ప్రాంతాల్లో తాగునీటి సక్రమంగా అందేలా చూడాలన్నారు. లీకేజీలను, అవసరమున్న చోట పైప్ లైన్ మరమ్మతులు చేయాలని, ఎప్పటికప్పుడు మోటర్ల ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, రాజయ్య, కుడా ఈఈ భీమ్రావు, జీడబ్ల్యూఎంసీ, ఇరిగేషన్, కూడా, ట్రాఫిక్ పోలీస్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, హార్టికల్చర్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.