నల్లమలను ప్రపంచానికి పరిచయం చేస్తాం

నల్లమలను ప్రపంచానికి పరిచయం చేస్తాం
  • దేశ, విదేశీ పర్యాటకులను రప్పిస్తాం 
  • నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం
  • మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ వెల్లడి
  • నల్లమలలో పర్యటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు

నాగర్ కర్నూల్, వెలుగు :  నల్లమల అడవుల్లో జలపాతాలు, వన్యమృగాలు, శైవ క్షేత్రాలు, చారిత్రక కట్టడాలను పరిరక్షించేలా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, దేశ,విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్శించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచేలా ప్రణాళికలు రూపొందిస్తామని రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ అన్నారు. స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నల్లమల్లలో పర్యాటకరంగ అభివృద్ధి కోసం రెండు రోజుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం శుక్రవారం ఇద్దరు మంత్రులతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, టూరిజం, అటవీశాఖ, ఇతర ఉన్నతాధికారులు ఫారెస్ట్​లో పర్యటించారు.

ముందుగా అచ్చంపేట ఉమామహేశ్వర ఆలయంలో పూజలు చేసి రంగాపూర్ నిరంజన్ షావలి దర్గాను దర్శించుకున్నారు. అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్ శివారు చింతల చెరువు వద్ద విద్యార్థులతో కలిసి 350 మొక్కలు నాటారు. తర్వాత నల్లమల్ల అటవీ ప్రాంతంలోని బౌరాపూర్ పెంట వరకు జంగల్ సఫారీ వాహనంలో పలు ప్రదేశాలను పరిశీలిస్తూ వెళ్లారు. ఫరాహాబాద్ ​వ్యూ పాయింట్ ​నుంచి నల్లమల అటవీ అందాలు, కృష్ణమ్మ సోయగాలు చూసి ముగ్ధులైపోయారు.  

నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం 

పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నల్లమల్లలో అందమైన ప్రదేశాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తామన్నారు. దీంతో పాటు రాష్ట్రంలోని ప్రతి జిల్లాను సందర్శించి అక్కడి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధితో తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇందులో భాగంగా స్థానిక నిరుద్యోగ యువతకు పెద్దపీట వేస్తామన్నారు. టూరిజం, ఫారెస్ట్ శాఖలు సంయుక్తంగా పీపీపీ పద్ధతి ద్వారా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి ఆదాయం పొందే విధంగా చేస్తామన్నారు.

వైద్యారోగ్య శాఖ, ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ నల్లమల్లను టూరిజం హబ్​గా మార్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, వాకిటి శ్రీహరి, డా.రాజేశ్​రెడ్డి, వీర్లపల్లి శంకర్, మధుసూదన్ రెడ్డి, మేఘారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, పర్యాటక పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ  ప్రకాష్ రెడ్డి,  పురావస్తు శాఖ  డైరెక్టర్ భారతి హోళీకేరి, పర్యాటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి, కలెక్టర్ బదావత్   సంతోష్, ఎస్పీ  వైభవ్ రఘునాథ్ గైక్వాడ్, డీఎఫ్​ఓ రోహిత్ పాల్గొన్నారు.