బీఆర్ఎస్ పాలనలోనే  నిజాం షుగర్స్​ మూత పడింది : పి.సుదర్శన్​రెడ్డి

బీఆర్ఎస్ పాలనలోనే  నిజాం షుగర్స్​ మూత పడింది : పి.సుదర్శన్​రెడ్డి
  •     ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది
  •     బోధన్​ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి

బోధన్, వెలుగు : బీఆర్ఎస్ అసమర్థ పాలన వల్ల నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ మూతపడిందని ఎమ్మెల్యే పి.సుదర్శన్​రెడ్డి ధ్వజమెత్తారు. బోధన్​లోని ఇరిగేషన్​ గెస్ట్​గౌస్ లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సిద్ధంగా ఉందన్నారు. అందుకే కమిటీని నియమించినట్లు చెప్పారు. ఈ నెల 20 శక్కర్​నగర్ లో ఉన్న నిజాం షుగర్​ఫ్యాక్టరీని పరిశీలించడానికి కమిటీ సభ్యులు వస్తున్నారన్నారు. అనంతరం దివ్యాంగులుకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆర్డీవో రాజాగౌడ్, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, టౌన్ ​ప్రెసిడెంట్​ పాషామొయినోద్దీన్, తూము శరత్​రెడ్డి పాల్గొన్నారు.

రైల్వే సమస్యలు పరిష్కరించాలి..

బోధన్ లోని రైల్వేలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్టూడెంట్​ జేఏసీ లీడర్లు డిమాండ్​చేశారు. ఈ మేరకు స్టూడెంట్ ​జేఏసీ ప్రెసిడెంట్​శివశంకర్​ ఆధ్వర్యంలో శనివారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మూసేసిన ఎడపల్లి ,శక్కర్ నగర్ స్టేషన్లను పున:ప్రారంభించాలని, బోధన్ రైల్వే స్టేషన్ లో మౌలిక వసతులు కల్పించాలని, గాంధీ పార్క్ రైల్వే ప్లాట్ ఫామ్​ఎత్తు పెంచాలని కోరారు. ఏడాదిగా రాయలసీమ ఎక్స్​ప్రెస్​ బోధన్​కు వస్తున్నా, టికెట్​మాత్రం ఇక్కడి నుంచి కాకుండా నిజామాబాద్​ నుంచి ఇస్తున్నారన్నారు. బోధన్ - బీదర్ రైల్వే లైన్ మంజూరయ్యేలా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. బోధన్, ఎడపల్లి, జానకంపేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే  సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించి, సమస్యలపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్​లో చేరికలు..

ఎడపల్లి : ఎడపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్​ లీడర్లు శనివారం కాంగ్రెస్​లో చేరారు. వీరికి ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఎడపల్లి సింగిల్​విండో చైర్మన్​ పోల మల్కారెడ్డి, బాపూనగర్​ మాజీ సర్పంచ్​ సునీత, మాజీ ఉపసర్పంచ్​కిరణ్​ తదితరులు ఉన్నారు.