- వొడితెల సవాల్‌ను స్వీకరించిన కౌశిక్
- ఉద్రిక్తతల నేపథ్యంలో ఇద్దరి హౌస్ అరెస్ట్
హుజురాబాద్ రూరల్/వీణవంక, వెలుగు : మంత్రి పొన్నం ప్రభాకర్‌పై చేస్తున్న ఆరోపణలు నిజమైతే కరీంనగర్ జిల్లా చెల్పూర్ హనుమాన్ టెంపుల్లో తడిబట్టలతో ప్రమాణం చేయాలని కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ సవాల్ విసరడం, ప్రమాణం చేసేందుకు వస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల ఫ్లై యాష్ రవాణా విషయంలో మంత్రి పొన్నంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేయగా..బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కౌశిక్ రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడని
మానేరు నుంచి ఇసుక దందా నడిపాడని వొడితల ప్రణవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డి దగ్గర ఆధారాలుంటే మంగళవారం 11 గంటలకు చెల్పూర్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి రావాలని ప్రణవ్ సోమవారం సవాల్ విసిరారు. దీంతో మంగళవారం ఆలయానికి వచ్చేందుకు కౌశిక్ రెడ్డి సిద్ధమయ్యారు. మరోవైపు కోర్టులో ఉద్యోగాలు పెట్టిస్తానని కౌశిక్ రెడ్డి తన దగ్గర రూ.20 లక్షలు తీసుకున్నాడంటూ చెల్పూర్ మాజీ సర్పంచ్ మహేందర్ చెల్పూర్ హనుమాన్ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను చెదరగొట్టారు.
ప్రణవ్, కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్
చెల్పూర్ కు బయల్దేరిన ప్రణవ్ ను పోలీసులు హుజూరాబాద్ మండలం సింగాపూర్‌లోని ఆయన ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయగా, వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తాను ఇంట్లోనే తడి బట్టలతో ఆంజనేయ స్వామి ఫొటో మీద ప్రమాణం చేస్తున్నట్లు కౌశిక్ రెడ్డి ప్రకటించారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేశారు. ఫ్లైయాష్ లో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని తాను ఆరోపించానని, అది నిజం కాదని మంత్రి ఎందుకు నిరూపించుకోవడం లేదన్నారు.
బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి వస్తే ఇద్దరం ప్రమాణం చేద్దామని సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా కౌశిక్ రెడ్డి ప్రమాణంపై ప్రణవ్ స్పందిస్తూ దేవుడిపై ఒట్టేసి అబద్దాలు ఆడడం సిగ్గు చేటన్నారు. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకున్నాడని ఆధారాలతో తాము వచ్చామని, కానీ మంత్రిపై ఎలాంటి ఆధారాలు చూపకుండా కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారని విమర్శించారు.