మెహిదీపట్నం, వెలుగు: హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం మాసబ్ ట్యాంక్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:10 గంటల నుంచి11:10 గంటల వరకు పోలీసులు ఆయనను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్టేట్మెంట్ ను రికార్డు చేశారు. కౌశిక్‌ను 32 ప్రశ్నలు అడిగామని పోలీసులు తెలిపారు. అనంతరం మీడియాతో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం తనపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాగా.. గత నెల 4న తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు కౌశిక్ వెళ్లారు. అయితే, ఇన్ స్పెక్టర్ వాహనానికి తన వాహనం అడ్డుపెట్టి విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపించారు.