
ప్రాణహాని ఉందంటూ సుబేదారి పోలీసులకు బాధితుల కంప్లయింట్
బీఆర్ఎస్ నేతపై నాన్ బెయిలబుల్ కేసు
హనుమకొండ, వెలుగు: హుజురాబాద్ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై వరంగల్ సుబేదారి పోలీసుస్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. బాధితులు తెలిపిన ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన కట్టా మనోజ్ రెడ్డికి హుజూరాబాద్ సెగ్మెంట్ పరిధి కమలాపూర్మండలం వంగపల్లి శివారులో గ్రానైట్‌క్వారీ ఉంది. అది తన పరిధిలో ఉందని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌నేత పాడి కౌశిక్‌రెడ్డి గతంలో మనోజ్‌రెడ్డిని బెదిరించి రూ.25 లక్షలు వసూలు చేశాడు.
మళ్లీ ఈనెల 18న మధ్యాహ్నం మరోసారి ఎమ్మెల్యే కాల్ చేసి రూ.50 లక్షలు డిమాండ్చేశాడు. క్వారీ నడవాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేనని, లేదంటే మనోజ్‌రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులను చంపుతానని బూతులు తిడుతూ బెదిరించాడు. దీంతో బాధితుడు రెండు రోజులుగా తీవ్ర భయాందోళన చెందుతుండగా ఆయన భార్య కట్టా ఉమాదేవి ఆరా తీయగా అసలు విషయం చెప్పాడు.
దీంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపుతానని బెదిరిస్తున్నాడంటూ ఉమాదేవి సుబేదారి పోలీసులకు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేశారు. తన ఫ్యామిలీకి ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని కంప్లయింట్ లో పేర్కొన్నారు. దీంతో పోలీసులు బీఎన్ఎస్ 308(2), 308(4), 352 సెక్షన్ల కింద 225/2025 ఎఫ్ఐఆర్నమోదు చేశారు. నాన్ బెయిలబుల్కేసు కావడంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని త్వరలోనే అరెస్ట్ చేసే చాన్స్ ఉంది.