
ఎన్నికల ప్రచారంలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. 2023, అక్టోబర్ 31వ తేదీ మంగళవారం నిజాంపేట్ మండల పరిధిలోని జెడ్ చెర్వు గ్రామంలో ప్రచారం చేసేందుకు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి వెళ్లగా గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పలువురు బీఆర్ఎస్ నాయకులు వారిని సముదాయించడానికి వెళ్లగా.. మా తండాకు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో చెప్పాలని వారు ప్రశ్నించారు.
ఎన్నికలు వచ్చాయని ఈ రోజు ఎమ్మెల్యే మా తండాకు వస్తున్నారని... మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదని వారు ప్రశ్నించారు. మేము ఎవరిని ఏమి అంటలేమని.. మా తండాలో డబుల్ బెడ్ రూమ్ లు, మూడెకరాల భూమి ఎవరికి ఇచ్చారని నిలదీశారు. మా తండాలో ఏమి డెవలప్ చేశారో చెబితే.. మేమే ఎమ్మెల్యేను ప్రచారానికి తీసుకుని వెళ్తామని బీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు. దీంతో చేసేదేమి లేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు.